కుందా సత్యనారాయణ కళా ధామం

భారతీయ పురాణ, ఇతిహాసాల విశేషాలను కళ్ల ముందుంచే సంపూర్ణ ఆధ్యాత్మిక, పౌరాణిక సందర్శనా స్థలం కుందా సత్యనారాయణ కళా ధామం. భారతదేశంలో మొట్టమొదటి ఆధ్యాత్మిక కళా ధామమైన ఈ అద్భుత నిర్మాణం భారతదేశ పౌరాణిక, సాంస్కృతిక, సంప్రదాయాల ఘన వారసత్వాన్ని సందర్శకులకు పరిచయం చేస్తుంది.

3 కిలో మీటర్ల పరిధిలో విశాలంగా నిర్మించిన ఈ కళా ధామాన్ని నడక మార్గంలో వెళుతూ సందర్శించాలి. రామాయణం, మహా భారతం, భాగవతం, బుద్ధుడి జీవితం.. ఇలా ఎన్నో పౌరాణిక గాథల్లోని ప్రముఖ ఘట్టాలను ప్రతిబింబించే అందమైన శిల్పాలు, విగ్రహాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ఇక్కడ పున:సృష్టించిన చారిత్రక ఆలయాల నమూనాలు అసలు దేవాలయాల నిర్మాణ శైలి, ఆకర్షణలు అసలు దేవాలయాలకు ఏమాత్రం తీసిపోవు. ఈ దేవాలయాల దర్శనం సందర్శకులకు అంతులేని ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది.

సందర్శన వేళలు

ప్రవేశ సమయం:
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు (ప్రతి రోజూ)

సందర్శన వేళలు:
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు (ప్రతి రోజూ)

ప్రవేశ రుసుము

పెద్దలకు : రూ.350

పిల్లలకు : రూ.300
(5 ఏళ్ల లోపువారికి ఎలాంటి రుసుము లేదు)

పంచముఖ హనుమంతుడు – శివుడు

పంచముఖ హనుమదీశ్వరుల సంయుక్త మహా శిల్పం
పంచముఖ హనుమంతుడు
సురేంద్రపురి ప్రాంగణంలో 60 ఎడుగుల ఎత్తయిన పంచముఖ హనుమంతుడి విగ్రహం దర్శనమిస్తుంది. వానర, నారసింహా, గరుడ, వరాహ, హయగ్రీవాలనే పంచ ముఖాలతో దశాయుధుడైన పంచముఖ ఆంజనేయుడు చూపరులకు నేత్ర పర్వాన్ని కలిగిస్తాడు. రామ లక్ష్మణులను పాతాళంలో దాచిన మైరావణుడిని సంహరించడానికి హనుమంతుడు ఈ అవతారం దాల్చాడు. అయిదు దిక్కులలో దాచి ఉంచిన తుమ్మెదలను ఏక కాలంలో చంపి వాటిలో నిక్షిప్తమై ఉన్న మైరావణుడి ప్రాణాలను హరించాడు.

పంచముఖ శివుడు
సురేంద్రపురిలో అడుగు పెట్టగానే పంచ ముఖ హనుమంతుడి విగ్రహం వెనుకనే 60 ఎడుగుల ఎత్తయిన పంచముఖ శివుడి విగ్రహం దర్శనమిస్తుంది. పరమ శివుడి పంచ ముఖాలు పంచ భూతాలకు, పంచ తత్వాలకు ప్రతీకలు. లోక కంటకుడైన త్రిపురాసురులనే రాక్షసులను సంహరించడానికి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములనే పంచ ముఖాలతో త్రిశులాన్ని చేత ధరించి ఆ రాక్షసులను సంహరించాడు.

పంచముఖ హనుమదీశ్వర దేవాలయం

పంచముఖ హనుమదీశ్వర దేవాలయ ప్రవేశ మార్గం వద్ద త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి అనుచర దేవతల అందమైన శిల్పాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆలయ గోపురాలను ఉత్తర, దక్షిణ నిర్మాణ శైలులను మేళవించి నిర్మించారు. ఆలయ నిర్మాణం మొత్తం వాస్తు శాస్త్రం, ఆగమ శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా జరిగింది.

ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ 16 అడుగుల పంచుముఖ హనుమంతుడి విగ్రహం. కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన నల్ల రాయిని తొలచి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మహా శివలింగం, పంచ ముఖ పరమేశ్వరుడు, నేపాల్ లోని పశుపతినాథ ఆలయాన్ని పోలిన దేవాలయాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. అభిషేకాలు కూడా చేయవచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి.

సందర్శన వేళలు

ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 3 – రాత్రి 8 గంటల వరకు (సోమవారం నుంచి శుక్రవారం వరకు)

ఉదయం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు (శని, ఆది వారాలు మరియు ప్రత్యేక సెలవు రోజుల్లో)

ప్రత్యేక పూజలు

  • సుప్రభాత సేవ
  • మన్యు సూక్తం శోడశోపచార పూజ
  • పంచామృతాభిషేకం
  • మన్యు సూక్తం పారాయణం, మొదలైనవి

నాగ కోటి శివ లింగం

నాగాద్రి కొండపై 101 అడుగుల ఎత్తయిన శివ లింగాన్ని ప్రతిష్ఠించారు. కాల సర్పం చుట్టుకుని ఉన్న లింగ రూప శివుడు నాగకోటీశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. పుట్ట మట్టితో చేసిన కోటీ లింగాల సముదాయమైన ఈ శివ లింగం ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే నాగ దోషం, కుజ దోషం, కాల సర్ప దోషాల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందవచ్చని భక్తుల నమ్మకం.

సందర్శన వేళలు

ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు (ప్రతి రోజూ)

ప్రత్యేక పూజలు

  • కాలసర్ప దోష పూజలు,
  • నాగ దోష పూజలు,
  • కుజ దోష పూజలు,
  • పరిహార పూజలు మొదలైనవి.